ఆసిఫాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన గొర్రెల కాపరి

ఎలుగుబంట్ల దాడిలో మేకల కాపరికి తీవ్ర గాయాలు
మూడు ఎలుగుబంట్లతో ఒంటరిగా పోరాడి ప్రాణాలతో బయటపడిన శంకర్
తీవ్ర రక్తస్రావంతో 3 కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరిక
పరిస్థితి విషమం.. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలింపు
తిర్యాణి తెలంగాణ అడ్డా ప్రతినిధి, సెప్టెంబర్ 4:
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మేకలు మేపేందుకు అడవికి వెళ్లిన వ్యక్తిపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేయడం కలకలం రేపింది. ఎలుగుబంట్లతో ఒంటరిగా పోరాడి ప్రాణాలతో బయటపడిన బాధితుడు తీవ్ర గాయాలతో సుమారు మూడు కిలోమీటర్లు పడుతూ లేస్తూ నడిచి గ్రామానికి చేరుకున్నాడు.
తిర్యాణి మండలం రోంపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోంపల్లి పంచాయతీ పరిధిలోని నాయకపుగూడకు చెందిన మోడితే శంకర్ (54) గురువారం మేకలను మేపేందుకు అడవికి వెళ్లాడు. మేకలు మేస్తుండగా ఒక్కసారిగా మూడు ఎలుగుబంట్లు శంకర్‌పై దాడి చేశాయి.
ఈ దాడిలో శంకర్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఒక చేయి విరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఎలుగుబంట్లను ఎదుర్కొని వాటి నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్నప్పటికీ సుమారు మూడు కిలోమీటర్లు అడవిలో పడుతూ లేస్తూ నడిచి గ్రామానికి చేరుకున్నాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే శంకర్‌ను చెలిమల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో రోంపల్లి అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అడవిలో ఎలుగుబంట్ల సంచారంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.