ఎర్రవెల్లి లో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల భేటీ

సెప్టెంబర్ 6న బీఆర్ఎస్‌ఎల్పీ సంయుక్త సమావేశం
ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది. శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ఈ మేరకు సెప్టెంబర్ 6న ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ అనంతరం, సరిగ్గా 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది.
రానున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఈ కీలక సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ సూచించారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశం కీలకంగా మారనుంది.