ఇంటర్ విద్యను తీసివేయాలని చూస్తే ప్రభుత్వ పతనము ఖాయం

ఇంటర్ విద్యను తీసేయాలని చూస్తే ప్రభుత్వ పతనం ఖాయం
తల్లిదండ్రులతో కొరివితో తలగొక్కున్నట్లే.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరిక
హైదరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
ఇంటర్మీడియేట్ విద్యను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే విద్యార్థుల తల్లిదండ్రులతో కొరివితో తలగొక్కున్నట్లేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్’ జంగ్ సైరన్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇంటర్మీడియేట్ విద్యను తొలగించాల్సిన అవసరం లేదన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన అనేక మంచి మార్పుల కారణంగా ఇంటర్ విద్య బలంగా తయారైందని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న అనేక మంది ఇంజనీర్లు మన దేశానికి చెందినవారేనని, అందుకు ఇంటర్ విద్య కూడా ఒక కారణమని అన్నారు. సమస్య లేని విద్యా విధానాన్ని ప్రభుత్వం అనవసరంగా సమస్యగా మార్చవద్దని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. వైట్ కాలర్ ఉద్యోగాలను వదిలి బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు వెళ్లాలని, ఇంజనీరింగ్ అవసరం లేదన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకవైపు ప్రకటనలు చేస్తూ, మరోవైపు ఇంటర్ ప్రవేశాల విషయంలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని విమర్శించారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని, ఇంటర్ విద్యను కొనసాగిస్తామని అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి, ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు.
ఇంటర్ విద్య పరిరక్షణ కోసం పోరాడుతున్న మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.