వావిలాలపల్లి అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భరోసా

వావిలాలపల్లిలో అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భరోసా
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ బాధితుల ఆరోపణలు
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో విశ్వ కేక్ జోన్ బేకరీలో జరిగిన అగ్నిప్రమాదంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదంలో బేకరీ పూర్తిగా దగ్ధం కావడంతో ఏళ్లుగా కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఉపాధి ఒక్కసారిగా బూడిద కావడంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
బేకరీకి సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లలో ఏర్పడిన లూజ్ కనెక్షన్ల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని బాధితులు ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను పరామర్శించి, ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించాలని, బాధితులకు జరిగిన నష్టంపై పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు.
బాధితులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.