Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 08:00 PM

ఆరేపల్లి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Main Image

ఆరెపల్లి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అల్లాడి రమేష్

పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న డాక్టర్ మనోహర్

భగవద్గీత బోధనలు మానవాళికి ఆదర్శనీయం: అల్లాడి రమేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లిలోని శ్రీకృష్ణ చైతన్య మఠం (ఇస్కాన్ ఆలయం)లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. మనోహర్ హాజరై శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన ప్రత్యేక హోమంలో పాల్గొన్న అల్లాడి రమేష్, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అల్లాడి రమేష్ మాట్లాడుతూ, ధర్మ మార్గాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మానవాళికి బోధించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమాజంలో అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని ప్రతిష్ఠించేందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చూపిన మార్గం నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకుని సన్మార్గంలో పయనించాలని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. మనోహర్, ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు గజవాడ గణేష్, కముటాల వేణు, రాజు, మదిశేటి కృపాల్, మల్యాల మహేందర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Clip Adjustments