రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ పశువుల తరలింపు భగ్నం

రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ పశువుల తరలింపు భగ్నం
57 పశువులు స్వాధీనం.. 11 మంది అరెస్ట్
5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం
రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ టీమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 57 పశువులను స్వాధీనం చేసుకుని, 11 మందిని అరెస్ట్ చేశారు.
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో..
కౌటాల నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా మూడు మహీంద్రా క్యాంపర్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా, వాటిలో 13 ఆవులు, 17 దూడలు.. మొత్తం 30 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు డ్రైవర్లు, నలుగురు సహాయకులు కలిపి 7 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి మూడు మహీంద్రా క్యాంపర్ వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో..
బెజ్జూర్ గ్రామం నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం తాళ్లగురిజాల గ్రామంలో ఆకస్మికంగా దాడి చేసింది.
పశువులతో వెళ్తున్న రెండు మహీంద్రా క్యాంపర్ వాహనాలను తనిఖీ చేయగా, వాటిలో 20 ఆవులు, 7 దూడలు.. మొత్తం 27 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సహాయకులు కలిపి 4 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రెండు మహీంద్రా క్యాంపర్ వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం స్వాధీనం..
రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి 57 పశువులు, 5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
పట్టుబడిన నిందితులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులు, వాహనాలు, మొబైల్ ఫోన్లు, పశువులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.