రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారం

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్‌దే అధికారం
ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ అడ్డా ప్రతినిధి:
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీలను ప్రాతిపదికగా చేసుకుని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, అర్హత ఉన్న కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలతో మహిళలకు, పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిందన్నారు.
గృహజ్యోతి
గృహజ్యోతి పథకం ద్వారా అర్హత ఉన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో లక్షలాది కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గిందన్నారు.
రైతు భరోసా
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేయడంతో లక్షలాది రైతు కుటుంబాలకు రుణభారం నుంచి ఉపశమనం లభించిందన్నారు. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించడంతో పాటు ఉచిత విద్యుత్, రైతు బీమా, పంట నష్టపరిహారం వంటి కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
చేయూత.. ఆరోగ్య భరోసా
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎమ్మెల్యే అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ, కొత్తగా అర్హులైన వారికి పింఛన్ల అమలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విశ్రమించదని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.