Back to Home
Watermark
శనివారం, 05 సెప్టెంబర్, 2026 TIME : 08:01 PM

ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Main Image

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

గురువుల సేవలు వెలకట్టలేనివి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

కరీంనగర్ పార్లమెంట్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

ఉపాధ్యాయుడు సమాజంలో మార్పుకు నాంది పలికే శక్తి అని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో పలు క్యాంపస్‌లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్, భగత్‌నగర్ అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్, మంకమ్మతోటలోని అల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్, వావిలాలపల్లిలోని టైనీ టాట్స్, ఎస్6 క్యాంపస్, కిసాన్‌నగర్ అల్ఫోర్స్ స్కూల్, విద్యారణ్యపురిలోని అల్ఫోర్స్ కిడ్స్ జీ తదితర క్యాంపస్‌లలో వేడుకలు వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమాలకు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. వేడుకల ప్రారంభానికి ముందు ఆయా క్యాంపస్‌లలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు గురువులు నిరంతరం కృషి చేస్తున్నారని, ఉపాధ్యాయులు లేని సమాజాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదని పేర్కొన్నారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ రెండో రాష్ట్రపతిగా విశిష్ట సేవలు అందించారని, ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించిందని గుర్తుచేశారు. విద్యార్థులు రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

విద్యార్థులే ఉపాధ్యాయులుగా..

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వయంగా తరగతులు నిర్వహించి బోధించే అవకాశం కల్పించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని డాక్టర్ నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

నరేందర్ రెడ్డికి ఘన సన్మానం

విద్యా రంగానికి విశేష సేవలందిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరేలా ప్రోత్సహిస్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డిని ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ‘గురువే లోకం’, ‘గురు బ్రహ్మ–గురు విష్ణు’ తదితర నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Clip Adjustments