కరీంనగర్ లో తీవ్రమైన జరాలు ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని కోరుతున్న నగరవాసులు

కరీంనగర్‌లో తీవ్రమైన జ్వరాలు.. ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేయాలి
ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్
కరీంనగర్ పార్లమెంట్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ జిల్లాలో జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య శాఖను సిద్ధం చేయాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలు జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లతో ఇబ్బందులు పడుతున్నారని హరిప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతున్నందున వైద్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు మందులు, రక్త పరీక్షలు, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని హరిప్రసాద్ కోరారు.
పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారని, అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల వైద్య సేవలు, సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ అవసరం
చిన్న జ్వరం వంటి సమస్యలకు కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
దోమల నివారణ చర్యలు ముమ్మరం చేయాలి
జ్వరాలకు కారణమయ్యే దోమల నివారణ కోసం గ్రామాలు, పట్టణాల్లో ఫాగింగ్, దోమల మందు పిచికారీ, నిల్వ నీటిని తొలగించడం, పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్య పరిరక్షణను కేవలం ప్రకటనలకు పరిమితం చేయకుండా ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రభుత్వాన్ని హరిప్రసాద్ డిమాండ్ చేశారు.