రైతులకు కరెంట్, సాగునీటి కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుబ్బాకలో మండిపడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

రైతులకు కరెంట్, సాగునీటి కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుబ్బాకలో మండిపడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
‘రైతు పొలికేక’ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
సిద్దిపేట ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
దుబ్బాక నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు పొలికేక’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ సాధన కోసం ప్రజలు రోడ్డెక్కి వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని, ప్రస్తుతం కనీసం ఎనిమిది గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగుల జీతాలు నిలిచిపోయినప్పటికీ రైతుబంధు పథకాన్ని ఆపకుండా కొనసాగించామని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపుపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
డీఏపీ, యూరియా కోసం యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల తీరును ప్రభుత్వం నియంత్రించడంలో విఫలమైందని, బస్తాకు 5 కిలోల తరుగు పేరుతో రైతులకు నష్టం జరుగుతోందని మండిపడ్డారు.
కాళేశ్వరంపై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే సాగునీటి సమస్యలు తీవ్రతరమయ్యాయని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి సహజ కరువు కాదని, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఏర్పడిన కృత్రిమ కరువని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. పెన్షన్ల పెంపు హామీ సంగతి పక్కనపెడితే, ఇప్పటికే ఉన్న పలువురి పెన్షన్లు తొలగించారని అన్నారు. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు కనుమరుగయ్యాయని విమర్శించారు.
రైతులు, ప్రజల సంక్షేమం కోసం మళ్లీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వం అవసరమని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, వైఫల్యాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.