కరీంనగర్లో ఘనంగా ‘యువ సమరభేరి’ సదస్సు

కరీంనగర్లో ఘనంగా ‘యువ సమరభేరి’ సదస్సు
కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ సమరభేరి’ (జెన్ జెడ్) సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగాలు, విద్య, భవిష్యత్ అవకాశాల కోసం యువతకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపడుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. పోలీసులు తమ విధులను నిర్వర్తించాలని, అయితే అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు.
‘యువత గొంతు రాహుల్ గాంధీకి వినిపించడం లేదా?’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు రాష్ట్రానికి రావాలని సూచించారు. అశోక్‌నగర్, కరీంనగర్ ప్రాంతాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడితే రాష్ట్రంలో యువతలో ఉన్న ఆవేదన, అసంతృప్తి అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, యూనివర్సిటీ భూముల సమస్యలు, గురుకులాల పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు.
బీజేపీపై కూడా కేటీఆర్ ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారని ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణకు చెందిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే అంశంపై బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో బలంగా వినిపించేందుకు కేసీఆర్ నాయకత్వమే అవసరమని పేర్కొన్నారు.
యువత పోరాటానికి పిలుపు
ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు తదితర సమస్యల పరిష్కారం కోసం యువత మరింత ఉత్సాహంగా ఉద్యమించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.