Back to Home
Watermark
శనివారం, 05 సెప్టెంబర్, 2026 TIME : 08:46 PM

ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి

Main Image

ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి

సెప్టెంబర్ 10న రాష్ట్రవ్యాప్త కార్యక్రమం.. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ పిలుపు

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారుల దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో రాష్ట్ర జేఏసీ రూపొందించిన ‘చలో హైదరాబాద్’ పోస్టర్‌ను విడుదల చేశారు.

కార్యక్రమం సన్నాహకంగా సెప్టెంబర్ 8న కరీంనగర్ టీఎన్జీవోల కమ్యూనిటీ భవనంలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈహెచ్‌ఎస్ అమలులో జాప్యంపై ఆవేదన

నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సూచనలు చేసినప్పటికీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో చిత్తశుద్ధి లోపించిందని ఆరోపించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు.

తాము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ పాలనను ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన హక్కులను మాత్రమే కోరుతున్నామని పేర్కొన్నారు.

సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ పునరుద్ధరణకు డిమాండ్

2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి అమలవుతున్న సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

ఉద్యోగుల భవిష్యత్తును షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులకు తాకట్టు పెట్టకుండా, ఉద్యోగులు–ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్ వాటాలను పెట్టుబడుల నుంచి భద్రంగా వెనక్కి తీసుకువచ్చి ఉద్యోగుల భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని కోరారు.

“పెన్షన్ బిక్ష కాదు.. ఉద్యోగి హక్కు. అది ఎవరి దయాదాక్షిణ్యం కాదు. ఉద్యోగికి, అతని కుటుంబానికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే హక్కు” అని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

పెండింగ్ బకాయిలు, పీఆర్‌సీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలోని లోపాలు తదితర సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు.

భారీగా తరలిరావాలని పిలుపు

సెప్టెంబర్ 8న కరీంనగర్‌లో జరిగే ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంతో పాటు, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, ఎడ్ల అరవింద్ రెడ్డి, మొహద్. ఉస్మాన్ పాషా, పి. నాగమోహన్, కె. కరుణాకర్ రెడ్డి, ఎ. కరుణాకర్ జైపాల్, పి. తిరుపతిరావు, డా. వెంకట రాజిరెడ్డి, ఎన్. రామ్మోహన్, పి. రామ్మోహన్, ఆదర్శన్ రెడ్డి, ఎస్. రాజేశ్వర్, ఈ. లింగప్ప, ఎం. సంపత్ కుమార్, కె. రామ్మోహన్, ఎ. నరహరి, ఎస్. ప్రభాకర్ రావు, పి. విజయ్ కుమార్, కె. చంద్రమౌళి, ఎం. ప్రవీణ్ రావు, కె. రాజిరెడ్డి తదితరులతో పాటు పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Clip Adjustments