ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి

ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి
అధికారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
వేములవాడ ప్రతినిధి / తెలంగాణ అడ్డా
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణలో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ శనివారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా నో మ్యాపింగ్ ఓటర్లు, అనామలీస్ ఓటర్ల వివరాలతో పాటు నూతన ఓటర్ల దరఖాస్తులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలో మొత్తం 1,217 మంది నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని సేకరించాలని కలెక్టర్ సూచించారు. తహసీల్దార్లు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు అన్ని గ్రామాల్లో జరుగుతున్న ప్రక్రియను విధిగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రజల సౌలభ్యం కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో సెప్టెంబర్ 6 (ఆదివారం), సెప్టెంబర్ 12 (శనివారం), 13 (ఆదివారం) తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఈఆర్ఓ/ఏఈఆర్ఓ కార్యాలయాల్లో ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
ఇదే పర్యటనలో భాగంగా చెక్కపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించిన ఆమె.. టెన్త్ క్లాస్ విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమైన దశ అని పేర్కొన్నారు.
వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. కేవలం చదవడం మాత్రమే కాకుండా రాయడం కూడా ముఖ్యమని, ప్రతిరోజూ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా అభ్యసించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, తహసీల్దార్ అబూ బాకర్ తదితరులు పాల్గొన్నారు.