Back to Home
Watermark
శనివారం, 05 సెప్టెంబర్, 2026 TIME : 09:03 PM

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు విడ్డూరం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

Main Image

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు విడ్డూరం

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా

కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మాట అటుంచితే, గత బీఆర్ఎస్ పాలకులు కనీసం రేషన్ కార్డుల్లో అదనపు పేర్లను నమోదు చేయడం, తప్పుల సవరణలు కూడా చేయలేకపోయారని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. అలాంటి వారు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

శనివారం మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్ కన్వెన్షన్‌లో మండలానికి చెందిన 100 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలమైందని, కుటుంబంలో కొత్తగా సభ్యులు చేరినా పేర్లు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అందిస్తోందని చెప్పారు. గత పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని, చేతగాని వారు ఇప్పుడు రోడ్డెక్కి విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన వారు ఇకనైనా అసత్య ప్రచారాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.

రాష్ట్రం ఆర్థిక లేమితో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేస్తున్నామని, ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీవీ వరలక్ష్మి, తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్, హౌసింగ్ పీడీ, వివిధ గ్రామాల ప్యాక్స్ చైర్మన్లు నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, గంగుల రాంరెడ్డి, రొంటాల లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, సర్పంచుల ఫోరం చైర్మన్ పెంచాల కిషన్ రావు, మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Clip Adjustments