బోయిన్పల్లిలో అర్ధరాత్రి యాప్‌లో స్టాక్ నమోదు.. అసలు మతలబేంటి?

యూరియా బస్తాలు ఉదయానికా.. అర్ధరాత్రి యాప్‌లోకా?
బోయిన్పల్లిలో అర్ధరాత్రి యాప్‌లో స్టాక్ నమోదు.. అసలు మతలబేంటి?
రైతులకు అందాల్సిన యూరియాపై అనుమానాలు.. అధికారుల తనిఖీలకు డిమాండ్
బోయిన్పల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా
బోయిన్పల్లి మండల కేంద్రంలోని కొన్ని ఫెర్టిలైజర్ షాపులు, ఫ్యాక్స్ సెంటర్లలో యూరియా బస్తాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదయం రైతులకు అందుబాటులో ఉంచాల్సిన యూరియా బస్తాలను అర్ధరాత్రి వేళల్లో యాప్‌లో నమోదు చేయడం వెనుక అసలు కారణమేంటన్న ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
పగటి సమయంలో యూరియా కోసం రైతులు షాపుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో.. రాత్రివేళల్లో మాత్రం యాప్‌లో స్టాక్ నమోదు చేయడం ఎందుకు? యాప్‌లో నమోదు చేస్తున్న సమయంలో ఆ బస్తాలు నిజంగానే షాపుల్లో ఉన్నాయా? స్టాక్ రిజిస్టర్‌లో ఉన్న వివరాలకు, యాప్‌లో నమోదైన వివరాలకు సరిపోలుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యూరియా పంపిణీలో పారదర్శకత ఉండాల్సిన సమయంలో అర్ధరాత్రి వేళల్లో స్టాక్ నమోదు చేయడంపై వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత షాపుల యాప్ లాగ్‌లు, పీఓఎస్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, భౌతిక నిల్వలను తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడుతుందని రైతులు అంటున్నారు.
రైతులకు కేటాయించిన సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న స్టాక్ నమోదుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అర్ధరాత్రి యాప్‌లో స్టాక్ నమోదు వెనుక కారణమేంటి? అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.