శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఘనంగా శ్రావణ మాస ఉత్సవాలు

శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఘనంగా శ్రావణ మాస ఉత్సవాలు
పాల్వంచ ప్రతినిధి / తెలంగాణ అడ్డా
పాల్వంచ పట్టణ పరిధిలోని గాంధీనగర్ 5వ వార్డు, 44వ డివిజన్‌లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. 1951 సంవత్సరంలో పెద్దపాలు చెట్టు కింద వేంచేసిన అమ్మవారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా శ్రావణమాసం 23వ రోజు, నాలుగో ఆదివారం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి బియ్యం, పప్పు, బెల్లం, పసుపు, కుంకుమ తదితర సామగ్రిని సేకరించి మట్టి కుండలో ప్రత్యేకంగా వండి ఉమ్మడి బోనాన్ని తయారు చేశారు. ఆ బోనాన్ని సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావించిన మహిళలు భక్తిశ్రద్ధలతో తలపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
నేలతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ భక్తుల పూనకాలతో పాటు మేకపోతులతో పురవీధుల్లో బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, పొంగలి బోనాలను శ్రీ ముత్యాలమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించారు.
తదుపరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లాపాపలు, పాడిపంటలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గంగపురి నాగేశ్వరరావు, ఆలయ పూజారి గడ్డం భాస్కర్ దాస్, కేసుపాక వెంకటేశ్వర్లు, లాయర్ కృష్ణ దంపతులు, సీహెచ్ చంద్రకళ, కోయిల శివ దంపతులు, డి. ఇందిర, దోసలకూరి శివరామకృష్ణ, డి. రాము, జి. విజయలక్ష్మి, నరిగె మధు, ఎం. రమాదేవి, డి. నాగమణి తదితరులు పాల్గొన్నారు.