పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతకు సువర్ణావకాశం

పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతకు సువర్ణావకాశం
70 రోజుల పాటు ఉచిత డేస్ స్కాలర్ క్లాసులు, గ్రౌండ్ కోచింగ్: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా
పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న భూపాలపల్లి జిల్లా యువతకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.
జిల్లా యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత డేస్ స్కాలర్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 6, 2026న జిల్లా పోలీస్ కార్యాలయంలో శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా సుమారు 350 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అనంతరం సింగరేణి హైస్కూల్‌లో రాత పరీక్షలు నిర్వహించగా, పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్వయంగా పరిశీలించారు. అభ్యర్థులతో మాట్లాడి పరీక్షల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, అందుబాటులో ఉన్న అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శారీరక, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 70 రోజుల పాటు ఉచిత డేస్ స్కాలర్ క్లాసులతో పాటు గ్రౌండ్ కోచింగ్ అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో యువత కష్టపడి చదవడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. పట్టుదల, క్రమశిక్షణతో శిక్షణ పొందితే ఉద్యోగ సాధన సులభమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు.