మెట్రో–ఆర్టీసీ సంయుక్త పాస్ తక్షణమే అమలు చేయాలి

మెట్రో–ఆర్టీసీ సంయుక్త పాస్ తక్షణమే అమలు చేయాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు ఆదేశం
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం మెట్రో–ఆర్టీసీ సంయుక్త (జాయింట్) పాస్‌ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు అధికారులను ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్‌లను జారీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్, టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో సీఎస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు మొదటి, రెండో దశల పురోగతిపై హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ బి. అజిత్ రెడ్డి, జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్ తదితరులు సీఎస్‌కు వివరాలు అందించారు.
మెట్రో–ఆర్టీసీ ప్రయాణికుల కోసం సంయుక్త పాస్ జారీకి సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎల్‌అండ్‌టీ మెట్రో, ఆర్టీసీ అధికారులు సీఎస్‌కు తెలిపారు. దీంతో సంయుక్త చార్జీల విధానాన్ని త్వరగా ఖరారు చేసి, జాయింట్ పాస్ వ్యవస్థను వెంటనే అమలు చేయాలని సంజయ్ జూజు స్పష్టం చేశారు.
పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలి
పాతబస్తీ మెట్రో కారిడార్ విస్తరణలో భాగంగా చేపడుతున్న రోడ్డు వెడల్పు పనుల పురోగతిని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. జనరల్ కన్సల్టెంట్ నియామకానికి సంబంధించిన టెండర్ ప్రక్రియపై అధికారులు వివరించారు. 7.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కారిడార్ విస్తరణ పనులను వేగవంతం చేసి, ప్రాజెక్టు కార్యకలాపాలను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి, మెట్రో రైలు చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డి.వి.ఎస్. రాజు, సీఎస్‌టీఈ స్వప్న కుమార్ దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జీఎం (ఫైనాన్స్) సూర్యప్రకాష్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మెట్రోలో ప్రయాణించిన సీఎస్
సమన్వయ సమావేశానికి ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు.. ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ బి. అజిత్ రెడ్డితో కలిసి బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయా మెట్రో స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి వాటి అభివృద్ధికి పలు సూచనలు చేశారు.
అలాగే ఎన్‌హెచ్-44పై హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లను కూడా సీఎస్ పరిశీలించారు.