ప్రజల పక్షాన నిలవడమే నిజమైన జర్నలిజం

ప్రజల పక్షాన నిలవడమే నిజమైన జర్నలిజం
నిజాయితీ, నిష్పక్షపాత వార్తలతో ప్రభుత్వం–ప్రజలకు బలమైన వారధిగా పనిచేయాలి
వరంగల్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా
ప్రజల పక్షాన నిలవడమే నిజమైన జర్నలిజమని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వరంగల్ పట్టణంలోని లేబర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం1 టీవీ ఛానల్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఈగ మల్లేశం మాట్లాడుతూ.. సమాజంలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నిజాయితీ, నిష్పక్షపాతంతో కూడిన వార్తలను అందిస్తూ ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వం–ప్రజల మధ్య బలమైన వారధిగా పనిచేయడమే నిజమైన జర్నలిజమని పేర్కొన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా వెనుకబడిన, బాధిత, అట్టడుగు వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎం1 టీవీ ప్రజల ఆదరణ పొందుతూ సమాజ శ్రేయస్సుకు మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎం1 టీవీ సీఈవో అమరేంద్ర చారి, ఎండీ బేతి అశోక్, బేతి రాజులు ఈగ మల్లేశంను శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యనారాయణ, గడ్డం భాస్కర్, చిప్ప వెంకటేశ్వర్లు, పోతన వెంకటేశ్వర్లు, మామిడాల రమేష్ బాబు, బంక కుమారస్వామి, కరుణాకర్, వేణు, ప్రసాద్, రాజు, శ్రీధర్, పవన్, మనోహర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.