మాధవాని కుంటను కాపాడాలి: జీహెచ్‌ఎంసీ డీసీకి బీజేపీ నేత వినతి

మాధవాని కుంటను కాపాడాలి: జీహెచ్‌ఎంసీ డీసీకి బీజేపీ నేత వినతి
బొల్లారం, తెలంగాణ అడ్డా:
బొల్లారం జీహెచ్‌ఎంసీ 272వ డివిజన్ పరిధిలోని మాధవాని కుంటలోకి డ్రైనేజీ, మురుగు నీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ బొల్లారం పట్టణ అధ్యక్షుడు కెజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు ఆయన డీసీని కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో బొల్లారం ప్రజలకు తాగునీటి వనరుగా ఉపయోగపడిన మాధవాని కుంట ప్రస్తుతం మురుగు నీరు కలవడంతో తీవ్రంగా కలుషితమవుతోందని ఆనంద్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుంటకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
బొల్లారం ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఈ కుంటలో నిర్వహిస్తారని, అలాగే మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించి బతుకమ్మలను కుంటలో సమర్పిస్తారని ఆయన గుర్తుచేశారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన కుంటను మురుగు నీటి నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
కుంటలోకి వస్తున్న డ్రైనేజీ లైన్‌ను తక్షణమే వేరుచేసి, ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా మురుగు నీటిని బయటకు మళ్లించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రపరచి, కుంటను పరిరక్షించాలని కోరారు.
మాధవాని కుంటలోకి ఇకపై ఎలాంటి మురుగు నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించి బొల్లారం ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యపై జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కెజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి తెలిపారు.