గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ భారీ నిరసన.. అసెంబ్లీలో టీషర్ట్ల వివాదంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ భారీ నిరసన.. అసెంబ్లీలో టీషర్ట్ల వివాదంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నల్ల టీషర్ట్లు ధరించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 1000 రోజులు గడిచినా ఆ హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నిరసనలో భాగంగా అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ అనుమతించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సభ్యులు ధరించిన టీషర్ట్లపై ఉన్న రాతలు బాగోలేవని, బట్టలు మార్చుకొని రావాలని చెప్పి లోనికి రానివ్వకపోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ సందర్భంగా పార్లమెంటులో రాహుల్ గాంధీ అదానీ, అంబానీ అంటూ పేర్లు రాసుకున్న టీషర్ట్లు వేసుకొని వెళ్లొచ్చని, కానీ తాము ప్రజా సమస్యలపై నినాదాలు రాసుకొని వెళ్తే అభ్యంతరం చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? పార్లమెంటులో ఒక పద్ధతి, అసెంబ్లీలో మరో పద్ధతియా? అని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వం తమ గొంతు నొక్కాలని చూస్తోందని, సమస్యలపై మాట్లాడకుండా అడ్డుకోవడం అప్రజాస్వామ్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.