ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టత.. ఇప్పట్లో ఆ ప్రక్రియ లేనట్లే!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశం ఇప్పట్లో కార్యరూపంలోకి రాలేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీతో ప్రభుత్వం చర్చలు జరిపినపుడు గుర్తింపు పొందిన కార్మిక సంఘం కోసం ఎన్నికలు నిర్వహించడం, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి 11 శాతం ఫిట్‌మెంట్ ఇవన్నీ నిర్ణయించినట్లు గుర్తు చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనంతో అనేక సమస్యలు వచ్చాయని, అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఎన్నికల నిర్వహణ కోసం కార్మిక శాఖ ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. జేఏసీతో జరిగిన చర్చల అంశాలపై ప్రభుత్వం ఎక్కడా తగ్గదని స్పష్టం చేశారు.
రూ.1,152 కోట్లు ఇవ్వాల్సి ఉంది
2017 నుంచి 2024 వరకు 13 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, వారికి రూ.1,152 కోట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అప్పుల్లో ముంచిందని విమర్శించారు. రిటైర్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి, సంస్థకు పూర్తి కన్సర్న్ ఉందని, ఆర్థిక వెసులుబాటును బట్టి చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. కార్మికుడు చనిపోతే రూ.కోటి వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
అవసరమైతే మరిన్ని స్థలాలు
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వానికి ఆర్టీసీ స్థలాలు ఇస్తున్నామని, అవసరమైతే ఇంకా ఇస్తామని మంత్రి తెలిపారు. గతంలో ఆర్టీసీ కోసం ప్రభుత్వం తమకు స్థలాలు కేటాయించిందని, ఇప్పుడు అవసరం మేరకు ఆర్టీసీ సైతం ఇస్తోందన్నారు. పేదల ఇళ్ల కోసం స్థలాలు ఇస్తే నేరం చేసినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు అమలు చేస్తామన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు నడుపుతారనే ప్రచారంలో వాస్తవం లేదని, అది పూర్తిగా దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ తీసుకురావడానికి ఐటీ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, హైదరాబాద్‌లో 18,766 ఆటోలకు రెట్రోఫిట్మెంట్ కోసం ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించి, శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని, ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.