Back to Home
Watermark
సోమవారం, 07 సెప్టెంబర్, 2026 TIME : 08:51 PM

దళిత స్పీకర్‌ను అవమానించిన తాత మధుపై చర్యలు తీసుకోవాలి

Main Image

దళిత స్పీకర్‌ను అవమానించిన తాత మధుపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: కమలాపూర్ ఏఎంసీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్

కమలాపూర్, తెలంగాణ అడ్డా:

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచితంగా, అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కమలాపూర్ ఏఎంసీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ డిమాండ్ చేశారు. తాత మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆమె కోరారు.

ఈ సందర్భంగా ఝాన్సీ రవీందర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో దళితులపై వివక్ష చూపిందని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను పదవి నుంచి తొలగించిన తీరును కూడా ఆమె ప్రస్తావించారు.

సిరిసిల్లలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై గతంలో వేధింపులు జరిగాయని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అవమానకరంగా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని అన్నారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాత మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఝాన్సీ రవీందర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

దళితుల గౌరవం, రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠను కాపాడేందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

Clip Adjustments