అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత - హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం పిటిషన్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవద్దంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం పిటిషన్ వేసింది. సోమవారం వెలువడిన ఆ ఉత్తర్వులను సవరించాలంటూ కోర్టును కోరింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారని, ప్లకార్డులు, వ్యతిరేక రాతలతో ఉన్న టీషర్టులు ధరించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని ధర్మాసనానికి విన్నవించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసులు వారిని అడ్డుకున్నారని వివరించారు.
శాసనసభ్యుల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని ఏజీ తెలిపారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను దూషించారని, వారిని నెట్టివేసి బూతులు తిట్టారని వాదించారు. బీఆర్ఎస్ సభ్యులు నల్ల టీషర్టులతో భయానక వాతావరణం కల్పించేలా చేశారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు.. చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌పై ఉంటుందని కదా అని ప్రశ్నించారు. సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని, ఆయన ఆదేశాలతోనే పోలీసులు శాసనసభ్యులను అడ్డుకున్నారని తెలిపారు. కాగా, హైకోర్టు మాత్రం ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది.

మహిళా పోలీసులను పరామర్శించిన మంత్రి సీతక్క
మరోవైపు సోమవారం జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మహిళా పోలీసులు మంత్రికి వివరించారు. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసభ్యకరంగా ప్రవర్తించారని, అనుచితంగా తాకిన వీడియోలను మహిళా పోలీసులు సీతక్కకు చూపించారు.