వ్యవసాయ మార్కెట్ తూకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం అవసరం: రేండ్ల రాజేశ్

వ్యవసాయ మార్కెట్ తూకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం అవసరం: రేండ్ల రాజేశ్
హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2026 (తెలంగాణ అడ్డా ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్న తూకం కార్మికుల (వెయిమెన్స్) సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సహకార క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు రేండ్ల రాజేశ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ తూకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో రేండ్ల రాజేశ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు, మార్కెట్ వ్యవస్థకు తూకం కార్మికులు కీలక సేవలు అందిస్తున్నప్పటికీ, అనేక సంవత్సరాలుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కార్మిక వర్గం మొత్తం ఐక్యంగా నిలిచి తూకం కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తూకం కార్మికుల ఉద్యోగ భద్రత, సంక్షేమం, పెండింగ్ సమస్యలు, ఇతర న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రేండ్ల రాజేశ్ కోరారు.
కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్న తూకం కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా గళం వినిపించారు.
కార్మికుల సమస్యలపై తన సంఘీభావాన్ని ప్రకటించిన రేండ్ల రాజేశ్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ తూకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రేండ్ల రాజేశ్ మాట్లాడుతూ.. “తూకం కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అవసరమైన ప్రతి సందర్భంలో కార్మికులకు అండగా నిలిచి, వారి హక్కుల సాధనకు నా వంతు సహకారం అందిస్తాను” అని తెలిపారు.