సోషల్ మీడియాలో హద్దులు మీరిన పోలీస్ యూనిఫామ్‌ను అడ్డం పెట్టుకుని మహిళలను కించపరచడంపై సర్వత్రా ఆగ్రహం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
వ్యూస్, లైక్స్ కోసం కొందరు వ్యక్తులు షార్ట్ ఫిల్మ్స్ పేరుతో హద్దులు మీరుతున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల పోలీస్ యూనిఫామ్ వేసుకొని, ఒక మహిళను అవమానించేలా తీసిన ఒక వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా, అది నిజమైన పోలీసులే చేశారేమో అన్నట్టు చాలామంది ఆ వీడియోను వైరల్ చేస్తూ పోలీసులపై నిందలు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పలువురు బాధ్యతాయుతమైన పౌరులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పలు కీలక విజ్ఞప్తులు చేస్తున్నారు. పోలీస్ యూనిఫాం అనేది మన సమాజ రక్షణకు, క్రమశిక్షణకు ప్రతీక అని, కేవలం వినోదం లేదా పబ్లిసిటీ కోసం ఆ వేషధారణను దుర్వినియోగం చేస్తూ మహిళలను కించపరచడం ఎంతమాత్రం సమంజసం కాదని పేర్కొంటున్నారు. వీడియోలో ఉన్నది అసలైన పోలీసులా లేక కేవలం నటులా అని ఆలోచించకుండా, మొత్తం పోలీస్ వ్యవస్థపై బురదజల్లడం సరికాదని హితవు పలుకుతున్నారు.
ఎలాంటి నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇలాంటి వీడియోలను షేర్ చేయడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అది నిజాయితీగా పనిచేసే పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ లేదా వినోదం పేరుతో వ్యవస్థలను, మహిళలను చులకన చేసే కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని హెచ్చరిస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వీడియోలను వైరల్ చేయకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా నిజానిజాలు తెలుసుకుని ప్రవర్తించాలని కోరుతున్నారు.