ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామావత్ గోవింద్‌రామ్

ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామావత్ గోవింద్‌రామ్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామావత్ గోవింద్‌రామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డిలోని వికాస్ వొకేషనల్ జూనియర్ కళాశాలకు ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యువల్ కోసం ఇన్‌స్పెక్షన్ నిర్వహించి నివేదిక సమర్పించేందుకు ఆయన లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
మొత్తం రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన ఆ అధికారి, ఇప్పటికే విడతల వారీగా రూ.30 వేలు లంచంగా తీసుకున్నాడు. బుధవారం తన కార్యాలయంలో మరో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజా విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ లబ్ది పొందాలని చూసిన ఆ అధికారిని అరెస్టు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. నిందితుడిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామని, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.