ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి నేత్ర పరీక్షా శిబిరాలు

ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి నేత్ర పరీక్షా శిబిరాలు
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/ తెలంగాణ అడ్డా:
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమగ్ర నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 15 నుంచి ప్రత్యేక నేత్ర పరీక్షా శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంపై వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలతో ఆమె అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ “నో స్కూల్ లెఫ్ట్ – నో చైల్డ్ లెఫ్ట్” అనే లక్ష్యంతో జిల్లాలోని ఏ ప్రభుత్వ పాఠశాల కూడా నేత్ర పరీక్షలకు దూరం కాకుండా, ఏ విద్యార్థి కూడా నేత్ర సమస్యలతో మిగిలిపోకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్లో దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు, కళ్లద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో నేత్ర పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, వైద్య సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేందర్ బాబు, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ నయీమ్‌జహా, డాక్టర్ సంపత్ కుమార్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఓ ఎన్‌హెచ్‌ఎం రాజేందర్, వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.