Back to Home
Watermark
బుధవారం, 09 సెప్టెంబర్, 2026 TIME : 08:01 PM

జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్

Main Image

జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు, జ్ఞాన భారతం మిషన్ అమలుపై హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా వాణి ప్రసాద్ మాట్లాడుతూ.. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతి జిల్లాకు నోడల్ పర్యాటక అధికారులను నియమించాలని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, సైన్‌బోర్డులు, శిక్షణ పొందిన గైడ్లు, ఫుడ్ కోర్టులు, దివ్యాంగులకు అనుకూలమైన మార్గాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. సినిమాల చిత్రీకరణకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని, విద్యార్థులకు పోటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 142 వీకెండ్ గేట్‌వే పర్యాటక ప్రాంతాలను గుర్తించామని, ప్రతి జిల్లా మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. జ్ఞాన భారతం మిషన్‌లో భాగంగా చారిత్రక ప్రదేశాలు, దేవాలయాల్లో అందుబాటులో ఉన్న ప్రాచీన గ్రంథాలు, రాత ప్రతులను గుర్తించి డిజిటలైజ్ చేయాలని, భాషా నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టూరిజం శాఖ డీఈ శ్రీశైలం, డీవైఎస్ఓ రాందాస్, డీటీసీపీఓ అన్సార్, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments