Back to Home
Watermark
బుధవారం, 09 సెప్టెంబర్, 2026 TIME : 08:03 PM

బొల్లారం 272 డివిజన్ ప్రజా సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం

Main Image

బొల్లారం 272 డివిజన్ ప్రజా సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం

పేద ప్రజల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలి: కె.జే.ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి

బొల్లారం, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా – జిన్నారం ప్రతినిధి):

బొల్లారం 272 డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి జి. శ్రీజన, ఐఏఎస్ గారికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.జే.ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బొల్లారం ప్రాంతంలోని పేద ప్రజలు, కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు వారి భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రంలో ప్రధానంగా కేబిఆర్ కాలనీ, గాంధీనగర్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లోని సుమారు 5 వేల ఇళ్లకు హౌస్ నంబర్ల మ్యూటేషన్‌ను ప్రస్తుత నివాసితుల పేర్లపై బదిలీ చేయడం, వీధి దీపాలను సక్రమంగా నిర్వహించడం, పారిశుధ్య సమస్యలను పరిష్కరించడం, ఇండస్ట్రీ ఏరియా, కేబిఆర్ కాలనీ, బీసీ కాలనీ, గాంధీనగర్‌లో పెండింగ్ రోడ్డు పనులను పూర్తి చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.

అలాగే రోడ్లపై జరుగుతున్న విక్రయాల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో మోడల్ ప్రభుత్వ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. నైట్ షిఫ్టుల్లో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రధాన ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పేద ప్రజలకు ఉపయోగపడేలా కులమతాలకు అతీతంగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడి పార్కులుగా అభివృద్ధి చేయాలని కోరారు. ముఖ్యంగా మాధవాని కుంటకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకుని మోడల్ చెరువుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

వైకుంఠధామంలో అంత్యక్రియల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేయకుండా ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించేలా సిబ్బందిని నియమించాలని, మరణ ధృవీకరణ పత్రాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లు, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఆటో స్టాండ్‌కు స్థలం కేటాయించాలని, బొల్లారంలో నూతన పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్‌ఐ సేవల పరిధిని బొల్లారం 272 డివిజన్‌కు అనుకూలంగా మార్చాలని, పేదలు, కార్మికుల ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నపూర్ణ భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా బొల్లారం ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలను కఠినంగా అరికట్టాలని, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

కమిషనర్ సానుకూల స్పందన

వినతిపత్రాన్ని స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీమతి జి. శ్రీజన, ఐఏఎస్ గారు ఆనంద్ కృష్ణారెడ్డి వివరించిన ప్రజా సమస్యలను పరిశీలించి, బొల్లారం ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చిన కమిషనర్ శ్రీమతి జి. శ్రీజన గారికి బొల్లారం ప్రజల తరఫున కె.జే.ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Clip Adjustments