పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న నిందితుడు అరెస్ట్.. రూ.12.50 లక్షల విలువైన మొక్కల స్వాధీనం

పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న నిందితుడు అరెస్ట్.. రూ.12.50 లక్షల విలువైన మొక్కల స్వాధీనం
ఆదిలాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా
బోరిగాం గ్రామ శివారులో పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఆడే కపిల్ అనే నిందితుడిని నేరడిగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో సుమారు 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 125 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, నిందితుడు రవాణా కోసం ఉపయోగించిన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇచ్చోడా రూరల్ సీఐ సిహెచ్ రమేష్ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై ఎంతటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి సాగు చేసేవారికి ప్రభుత్వ పథకాలు అందకుండా సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలందరూ పోలీసులకు తగిన సహకారం అందించాలని ఆయన కోరారు.