వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం

వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా):
తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ సాధికారిత సంఘం ఇంచార్జి పొలాస నరేందర్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిందన్నారు. అణగారిన వర్గాలు, సబ్బండ వర్గాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.
నాటి నిజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, జమీందార్లు, పటేల్, పట్వారీలు, జాగీర్దార్ల నిరంకుశ పాలనలో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నరేందర్ పేర్కొన్నారు. భూస్వాముల దౌర్జన్యాలను, వెట్టి చాకిరీని ఎదిరిస్తూ ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం పోరాటం సాగించారని తెలిపారు.
ఐలమ్మ ఉద్యమం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చేందుకు దేశ్‌ముఖ్‌లు ఆమె భర్త నర్సయ్య, ఇద్దరు కుమారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, పంటలు, ఆస్తులకు నష్టం కలిగించినప్పటికీ ఐలమ్మ ఏమాత్రం భయపడకుండా పోరాటాన్ని కొనసాగించారని నరేందర్ అన్నారు. కొంగును నడుముకు చుట్టి, చేతిలో కొడవలి పట్టుకుని సింహంలా ధైర్యంగా ముందుకు సాగిన వీరవనితగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
మహిళలకు రక్షణ కవచంలా, అణగారిన వర్గాలకు అండగా ఐలమ్మ నిలిచారని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తితో సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా వేలాది గ్రామాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందగా, భూస్వాముల ఆధీనంలోని భూముల్లో పెద్ద మొత్తంలో పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు.
చాకలి ఐలమ్మ భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె ఆశయాలు, ఆలోచనలు, పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని నరేందర్ అన్నారు. మహిళలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం నేతలు లింగంపల్లి దేవయ్య, కనపర్తి సుధాకర్, పిన్నింటి హన్మాండ్లు, వాసం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.