ఎర్రవెల్లి ఘటనపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆగ్రహం.. బోయినిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

దళితుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదు
ఎర్రవెల్లి ఘటనపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆగ్రహం.. బోయినిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
బోయినిపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా):
ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం దళితులు నడిచిన రహదారులను బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పసుపు నీటితో కడిగి “శుద్ధీకరణ” చేశారనే విషయం సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ చర్య కుల వివక్షను ప్రతిబింబించడమే కాకుండా దళితుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా కించపరిచేలా ఉందని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోయినిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నిరటి ప్రదీప్ కుమార్, సర్పంచులు జంగం అంజయ్య, ఇల్లంధుల రాజు, సెస్ డైరెక్టర్ కొట్టేపెల్లి సుధాకర్, జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు కత్తెరపాక రవి, వర్ధవెల్లి ఉపసర్పంచ్ మందాల వరుణ్, మంకాళి నగేష్, మండల శ్రీనివాస్, మందాల ప్రభాకర్, మందాల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.