ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణలో రాజీలేని పోలీసింగ్: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణలో రాజీలేని పోలీసింగ్: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి బ్యూరో / తెలంగాణ అడ్డా:
భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు మరియు నేర నియంత్రణ చర్యలను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దొంగతనాల నియంత్రణకు గస్తీ, నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని స్పష్టం చేశారు.
సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ పోలీస్ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో, రాజీకి అవకాశం ఉన్న కేసులను న్యాయశాఖ సమన్వయంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామ స్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ ఆదేశించారు.