యోగాలో ఒలింపిక్ స్థాయికి ఎదగాలి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అట్టహాసంగా రాష్ట్రస్థాయి యోగా పోటీలు ప్రారంభం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
భారత్‌లో 2036లో జరిగే ఒలింపిక్స్‌లో యోగాలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పోషకులు వూటుకూరి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్‌లో శుక్రవారం జరిగిన 13వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగా చాంపియన్షిప్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతీయ చరిత్రకు మూలాధారమైన యోగాతో సకల ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాల్లోని విభిన్న క్రీడలకు ఆధారం యోగా అన్నారు. మానసిక రుగ్మతలను దూరం చేస్తూ మనిషిని సదా ఉల్లాసంగా ఉత్తేజంతో కూడిన శరీర ధారుఢ్యానికి ఇది దోహదం చేస్తుందన్నారు. చిన్నారుల మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వామ్యం కావాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు వేదికగా నిలవడం సంతోషదాయకం అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ జిల్లాలో యోగా క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి గణనీయంగా సేవలందించినట్లు చెప్పారు. తమ అసోసియేషన్ కృషి ఫలితంగా 2004 నుండి కరీంనగర్ జిల్లా 16 సార్లు రాష్ట్రంలోనే ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవడం ఇక్కడి క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనం అన్నారు. అంతర్జాతీయ స్థాయి యోగా పోటీలలో కరీంనగర్ జిల్లా నుండి ఎన్. సిద్ధారెడ్డి, ఆర్. ప్రణీత, బి. యమున, టి. మనోజ్ కుమార్, పి. దేవయ్య, ఎం. ఉదయ్ కిరణ్ లు భారతదేశానికి ప్రాతినిథ్యం వహించి పలు పతకాలు సాధించారని చెప్పారు. యోగాలో రాణించిన క్రీడాకారులు ప్రొఫెషనల్ కోర్సులలో స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందారని తెలిపారు.
తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణలో మరోసారి కరీంనగర్ రికార్డ్ సృష్టించినట్లు చెప్పారు. ఈ రాష్ట్ర పోటీలో రాణించే క్రీడాకారులు రాజస్థాన్‌లోని జైపూర్‌లో వచ్చేనెల 3 నుండి జరిగే జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. సిద్ధారెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలో రాష్ట్రంలోని 24 జిల్లాల నుండి వేయి మంది హాజరైనట్లు చెప్పారు. సబ్ జూనియర్ విభాగంలో 8-10, 10-12, 12-14, జూనియర్ విభాగంలో 14-16, 16-18 వయసుల విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2017 నుండి 2025 వరకు క్రమం తప్పకుండా రాష్ట్రస్థాయి పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం ఇచ్చినట్లు చెప్పారు.
అంతకుముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయగా, నల్గొండ, కరీంనగర్ జిల్లాల క్రీడాకారులు ప్రదర్శించిన యోగాసనాలు పలువురిని అబ్బురపరిచాయి. మల్లీశ్వరి, రామకృష్ణ ల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. పాయింట్లు పారదర్శకంగా కేటాయించడమే కాకుండా పోటీలను నిష్పక్షపాతంగా నిర్వహించేలా రికార్డు స్థాయిలో తొలిసారిగా ఆన్ స్క్రీన్ ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్రంలోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జి. జనార్దన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి. రమేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కమలాకర్, యోగా ఫెడరేషన్ డిస్ప్యూట్ కమిటీ సభ్యులు టి. మనోజ్ కుమార్, యోగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి రామకృష్ణ, స్వరూప, చారి, ప్రశాంత్, ఆనంద్, కిషోర్, వి. కిష్టయ్య, రాష్ట్రంలోని వివిధ జిల్లాల యోగ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.