పట్టోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డికి మండల కాంగ్రెస్ పగ్గాలు?

టేక్మాల్ మండల కాంగ్రెస్‌కు నూతన శకం
పట్టోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డికి మండల కాంగ్రెస్ పగ్గాలు?
రేపో మాపో అధికారిక ప్రకటన
టేక్మాల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా):
టేక్మాల్ మండల కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుమారు 18 ఏళ్లుగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నిమ్మ రమేష్ స్థానంలో బర్థిపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్టోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డిని నూతన మండల అధ్యక్షుడిగా నియమించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.
ఏఐసీసీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచనలతో ఈ మార్పు జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
నాయకత్వం అంటే పదవి కాదు.. బాధ్యత
విష్ణు వర్ధన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, సీనియర్లు, యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మారుమూల గ్రామమైన బర్థిపూర్ నుంచి ఎదిగిన నాయకుడిగా ఆయనకు మండలంలోని కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిమ్మ రమేష్ సేవలకు గుర్తింపు
18 ఏళ్ల పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన నిమ్మ రమేష్ సేవలను పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. పదవులు శాశ్వతం కావని, నాయకులు చేసిన సేవలే శాశ్వతంగా నిలిచిపోతాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. సీనియర్ నాయకత్వానికి గౌరవం ఇస్తూనే, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడం పార్టీని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగమని అభిప్రాయపడుతున్నారు.
కొత్త నాయకత్వంపై ఆశలు
సీనియర్ నాయకుడైన విష్ణు వర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించడం ద్వారా టేక్మాల్ మండల కాంగ్రెస్‌లో నూతన ఉత్తేజం వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఆయన నాయకత్వంలో యువత, సీనియర్లను కలుపుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తి కంటే పార్టీ గొప్పది.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడమే కాంగ్రెస్ క్రమశిక్షణ అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
పట్టోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డికి మండల కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే టేక్మాల్ కాంగ్రెస్‌లో ఇది కొత్త అధ్యాయం, కొత్త ఆశలకు నాంది అవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.