Back to Home
Watermark
శనివారం, 12 సెప్టెంబర్, 2026 TIME : 04:48 PM

ఖేలో ఇండియాలో పతకాలు సాధించి తెలంగాణను నంబర్ వన్ గా నిలపాలి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ముగిసిన రాష్ట్రస్థాయి యోగా పోటీలు, ఓవరాల్ చాంపియన్‌గా కరీంనగర్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో యోగా క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్‌లో జరిగిన 17వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్వతహాగా క్రీడాకారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పోటీలకు మన రాష్ట్రం ఆతిథ్యమిస్తోందన్నారు. యోగాతో పాటు మిగతా క్రీడల్లోనూ రాణించి తెలంగాణను నంబర్ వన్ గా నిలపాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి తమకు అభిరుచి ఉన్న క్రీడల్లో ప్రణాళికాబద్ధంగా నిత్య సాధన చేస్తేనే ఉన్నత స్థాయికి ఎదుగుతారని, చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ల ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ యోగ అసోసియేషన్ చైర్మన్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ యోగాకు చిరునామాగా కరీంనగర్ నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇక్కడ క్రీడాకారులు సాధించిన స్ఫూర్తితో జాతీయస్థాయి యోగాలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి మాట్లాడుతూ స్వల్ప వ్యవధిలో ఘనంగా రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించిన కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్‌నుఅభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యమే లక్ష్యంగా క్రీడాకారులు సాధన చేయాలని సూచించారు.తెలంగాణ యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. సిద్ధారెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన వెయ్యి మంది క్రీడాకారులతో చక్కటి యోగా పోటీలు నిర్వహించినట్లు చెప్పారు.

ఓవరాల్ చాంపియన్‌గా కరీంనగర్:

Additional Image

కరీంనగర్ జిల్లా క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనబరిచి వరుసగా 17వ సారి ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడం విశేషం. రెండో స్థానాన్ని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సంయుక్తంగా సాధించగా, మూడో స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచింది. అనంతరం విజేతలకు అతిథులు ట్రోఫీలతో పాటు వ్యక్తిగత పతకాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో పతకం సాధించిన దీపక్, ఫెడరేషన్ బాధ్యుడు మనోజ్ కుమార్‌ను అతిథులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జి. జనార్దన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు టి. రమేష్ రెడ్డి, కన్న కృష్ణ, రాష్ట్ర యోగ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి. కమలాకర్, జిల్లా యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుంటి రామకృష్ణ, మనోజ్, స్వరూపాచారి, గంగాధర్, కిష్టయ్య, మల్లేశ్వరి, ఆనంద్ కిషోర్, వీణావాణి, సందీప్, సత్య గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments