కొత్తపల్లి–జగిత్యాల హైవేపై సీసీ కెమెరాల ఏర్పాటు.. ప్రారంభించిన అదనపు డీసీపీ వెంకటరమణ రెడ్డి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

ప్రజల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకమని అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ వెంకటరమణ రెడ్డి అన్నారు. కొత్తపల్లి–జగిత్యాల హైవేపై ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ బి. కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రధాన రహదారులు, హైవేలపై ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు 24×7 నిఘా, వాహనాల కదలికల పర్యవేక్షణ, ప్రమాదాల గుర్తింపు, నేరాలకు సంబంధించిన ఆధారాల సేకరణ వంటి అంశాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు సంఘటనకు సంబంధించిన దృశ్యాలను పరిశీలించడం ద్వారా దర్యాప్తును వేగవంతం చేయడానికి వీలుంటుందని పేర్కొన్నారు. కొత్తపల్లి–జగిత్యాల హైవేపై ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం, రోడ్డు ప్రమాదాలపై తక్షణ స్పందనకు సహకరించడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలను గుర్తించడం వంటి చర్యలకు మరింత అవకాశం కలుగుతుందని తెలిపారు. హై-రిజల్యూషన్ వీడియో రికార్డింగ్, రాత్రి వేళల్లో నిఘా, వాహనాల నంబర్ ప్లేట్‌లను గుర్తించే సాంకేతికత ఉండటం వల్ల హైవేలపై భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని వివరించారు. ప్రజా సేవలో నిమగ్నమై సమాజ హితమైన కార్యక్రమాలు చేస్తున్న నరేందర్ రెడ్డిని ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా భద్రతకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రహదారులపై ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలు హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగించడం, వేగ నియంత్రణ పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం ద్వారా రహదారి భద్రతకు సహకరించాలని సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సూచన మేరకు వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.