Back to Home
Watermark
శనివారం, 12 సెప్టెంబర్, 2026 TIME : 06:53 PM

దేశ సమైక్యతకు సెక్యులరిజం, ప్రజాస్వామ్యం రెండు కళ్లులాంటివి

Main Image

ఆర్ఎస్ఎస్, బీజేపీ కబంధహస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి

దేశ సమైక్యతకు సెక్యులరిజం, ప్రజాస్వామ్యం రెండు కళ్లులాంటివి

సీతారాం ఏచూరి స్మారక సెమినార్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్‌బాబు

వేములవాడ, సెప్టెంబర్ 12 (తెలంగాణ అడ్డా ప్రతినిధి):

రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్‌బాబు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కబంధహస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వేములవాడ సుభాష్‌నగర్‌లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం అగ్రనేత, అమరజీవి సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా ‘భారత రాజ్యాంగం–ప్రజాస్వామ్యం సవాళ్లు’ అనే అంశంపై శనివారం సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అధ్యక్షత వహించారు.

ముఖ్య వక్తగా పాల్గొన్న టీ. స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయని అన్నారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు తదితర వర్గాలకు చెందిన ఓట్ల తొలగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 భావప్రకటన స్వేచ్ఛను కల్పిస్తుందని, అయితే ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. హేతువాదులు, మేధావులు దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ వంటి వారి హత్యలను ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్‌ 21 ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును కల్పిస్తుందని, కానీ ప్రజల ఆహారం, వస్త్రధారణ, జీవన విధానంపై కూడా నియంత్రణలు విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రైతులకు గిట్టుబాటు ధరలు, కార్మికులకు కనీస వేతనాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వంటి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాల వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని అన్నారు.

విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పరీక్షా వ్యవస్థలో అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని అన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.

కార్మికుల హక్కులను పరిరక్షించే పాత కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం ద్వారా కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని స్కైలాబ్‌బాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సీతారాం ఏచూరి జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. భారతదేశ సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామ్యం, లౌకిక విలువల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం, సెక్యులరిజం రెండు కళ్లులాంటివని, వాటిని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

సెమినార్‌కు ముందు సీతారాం ఏచూరి చిత్రపటానికి టీ. స్కైలాబ్‌బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్, సూరం పద్మ, గురిజాల శ్రీధర్, ఎరవెల్లి నాగరాజు, మల్లారపు ప్రశాంత్, వివిధ ప్రజా సంఘాల నాయకులు శ్రీరాం సదానందం, ఎలిగేటి రాజశేఖర్, రామంచ అశోక్, ఆడెపు రజిత, పరశురాం, కడారి శివ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments