సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరుపుకోవాలి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే
పోరాటంలో పాల్గొనని మతోన్మాదులకు మాట్లాడే అర్హత లేదు
సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరుపుకోవాలి
సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు
తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయినపల్లి:
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక పోరాటమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ఈ పోరాట చరిత్రను మతపరమైన కోణంలో వక్రీకరించడం సరికాదన్నారు. పోరాటంలో పాల్గొనని మతోన్మాద శక్తులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సీపీఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర, దాని ప్రాధాన్యతను వివరించారు.
1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు దాదాపు ఐదేళ్లపాటు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని వారు పేర్కొన్నారు. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జమీందార్లు, జాగీర్దార్ల దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై పోరాడారని తెలిపారు.
వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాటం
నిజాం పాలనలో గ్రామీణ ప్రజలు అనేక రకాల దోపిడీ, అణచివేతకు గురయ్యారని నాయకులు తెలిపారు. రైతులు తమ సొంత భూముల్లో సాగు చేసుకునే ముందు భూస్వాముల భూముల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. దున్నడం, విత్తనాలు వేయడం, నాట్లు వేయడం వంటి వ్యవసాయ పనులను భూస్వాముల భూముల్లో పూర్తి చేసిన తర్వాతే తమ భూములను సాగు చేసుకునే పరిస్థితులు ఉండేవని వివరించారు.
కమ్మరి, కుమ్మరి, మేదరి తదితర వృత్తిదారులు తమ ఉత్పత్తులను ఉచితంగా అందించాల్సిన పరిస్థితి ఉండేదని, గొర్రెలు, మేకలు తదితరాలను కూడా ఉచితంగా ఇవ్వాల్సి వచ్చేదని తెలిపారు. మరోవైపు పలు రకాల పన్నుల భారం ప్రజలపై ఉండేదన్నారు. ఈ దోపిడీ, వెట్టి చాకిరీ, అణచివేతకు వ్యతిరేకంగానే రైతాంగ పోరాటం ఉద్భవించిందని పేర్కొన్నారు.
మతపోరాటంగా చిత్రీకరించడం సరికాదు
స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీసిన పరిణామాలను, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మతపరమైన ఘర్షణగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనని సీపీఎం నాయకులు అన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం హిందూ, ముస్లిం ప్రజల మధ్య పోరాటం కాదని, భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరీ, అణచివేతకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు సాగించిన పోరాటమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను మతపరమైన కోణంలో ప్రచారం చేస్తూ ప్రజలను, యువతను చారిత్రక వాస్తవాల నుంచి పక్కదారి పట్టించవద్దని కోరారు.
కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను, దాని లక్ష్యాలను యువతకు తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. చరిత్రను వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేసి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుడుకల గిరిబాబు, గ్రామస్తులు రామంచ ప్రభాకర్, గోల్కొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.