నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

తెలంగాణకు రెయిన్ అలర్ట్
నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
వేములవాడ తెలంగాణ అడ్డా ప్రతినిధి సెప్టెంబర్ 14:
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని ప్రభావంతో కొనసాగుతున్న ద్రోణి కారణంగా నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో కూడా వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లోనూ నగరంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.