సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవరకు కదిలేది లేదంటూ బీఆర్ఎస్ నేతల బైఠాయింపు

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో తమపై జరిగిన దాడి ఘటనపై కేటీఆర్ గారి పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ మాణిక్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే, ఈ ఘటనపై విచారణ చేసి కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు దాటవేత వైఖరి అవలంబిస్తున్నారని నాయకులు ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజ్ అడిగినా ఇవ్వకుండా పోలీసులు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం చూస్తుంటే.. ఇది ముమ్మాటికీ కుట్రపూరిత దాడేనని స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బంది విచారణ ముగిసింది. ఈ విచారణ సందర్భంగా పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద ఇరువురికి నోటీసులు జారీ చేశారు. తాము పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తామని పీఏ, పీఆర్వో తెలిపారు.
అయినప్పటికీ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేవరకు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడినుండి కదిలేది లేదని తేల్చిచెబుతూ కేటీఆర్ సిబ్బంది, బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ స్టేషన్‌లోనే కూర్చుని నిరసన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా, బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందుకు తరలివచ్చి ఆందోళనలో భాగమయ్యారు.