ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించని పక్షంలో హైదరాబాద్ దిగ్భంధం తప్పదు బీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో బీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట తప్పడం, మడమ తిప్పడం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని ఎద్దేవా చేశారు. సమస్యలు తీర్చాలని అడిగితే ఉద్యోగులు, ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడని, ఉద్యోగులంటే మీ బానిసలు కాదని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ నెల 18 లోగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వారి పోరాటానికి టీఆర్ఎస్ అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ఉద్యోగం కన్నా ఉద్యమమే ముఖ్యమని పోరాడారని, కానీ నేడు రేవంత్ రెడ్డి సర్కార్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మెరుగైన పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం అవసరమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో లక్షా 20 వేల మంది టీచర్లు మాత్రమే ఉంటారని, వాళ్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి రాలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోదని స్పష్టం చేశారు.డీఏ బకాయిలు: మోడీ కారణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు డీఏ ఇవ్వాల్సి ఉండగా, 32 నెలలుగా డీఏ ఇవ్వకుండా ముఖ్యమంత్రి వారి కరువు భత్యాన్ని మింగేశారని విమర్శించారు.

ఓపీఎస్ అమలు: 2003లో రిక్రూట్ అయిన పోలీసులకు, టీచర్లకు ఓపీఎస్ (పాత పెన్షన్ విధానం) అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2003లో రిక్రూట్ అయిన టీచర్లకు ఓపీఎస్ ఇస్తే ప్రభుత్వానికే రూ. 2 వేల కోట్లు మిగులుతాయని, ఆ మొత్తంతో మిగతా బకాయిలు తీర్చవచ్చని సూచించారు.
పీఆర్సీ - ఫిట్‌మెంట్: ఉద్యోగుల పీఆర్సీ ఎక్స్ పైరీ అయ్యే పరిస్థితి ఉందని, తక్షణమే వారికి 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.హెల్త్ కార్డ్స్ సవాల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డు ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుందా అని ముఖ్యమంత్రికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని, పనిచేస్తే మీరు ఏం చేయమంటే అది టీఆర్ఎస్ చేస్తుందని, లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.317 జీవో బాధితులు: 317 జీవో బాధితులకు, ముఖ్యంగా ఎక్కువగా బాధపడుతున్న మహిళా ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు: బకాయిపడ్డ జీతాలను వెంటనే చెల్లించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ నెల 18 వరకు సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని, ఆ తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే హైదరాబాద్ దిగ్భంధం కోసం ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వాలని, మీ భుజం తట్టి మీకోసం తాము పోరాటం చేస్తామని కవిత హామీనిచ్చారు.