గిరిజనులను నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్: బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గూగులోతు సురేష్ నాయక్

వీర్నపల్లి / తెలంగాణ అడ్డా:
ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూగులోతు సురేష్ నాయక్ నిప్పులు చెరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేసీఆర్ హయాంలో గిరిజనులకు స్వర్ణయుగం తెలంగాణ స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల సంక్షేమానికి, అభ్యున్నతికి పెద్దపీట వేశారని కొనియాడారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 33 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులను పాలకులుగా తీర్చిదిద్దారన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రూ.50 కోట్లతో ఆత్మగౌరవ ప్రతీకగా బంజారా భవన్ నిర్మించడంతో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ బంజారా భవన నిర్మాణానికి ఒక ఎకరం స్థలం, రూ.2.10 కోట్ల నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజనుల బతుకులకు భరోసా కల్పించారని, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించి సమాజ గౌరవాన్ని పెంచారని పేర్కొన్నారు.హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ బంజారాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికార పగ్గాలు చేపట్టి వెయ్యి రోజులు గడుస్తున్నా గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 50 వేల జనాభా దాటిన మండలాలను, నియోజకవర్గ కేంద్రాలను ఐటీడీఏలుగా ప్రకటిస్తామని మోసం చేశారని మండిపడ్డారు. మండలాల్లో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయకుండా మొండిచేయి చూపారని, కేబినెట్‌లో బంజారాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండాల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు ఆర్థిక సాయం, నిరుద్యోగులకు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వంటి అంశాల్లోనూ యువతను నిలువునా వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 17న పల్లెపల్లెనా నిరసనలు:
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఎండగడుతూ ఈనెల 17వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సురేష్ నాయక్ ప్రకటించారు. గిరిజన పక్షపాతి కేసీఆర్ ఫ్లెక్సీలతో పాటు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు ప్రతి తండాలో ఘనంగా పాలాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి అజ్మీరా తిరుపతి నాయక్, వీర్నపల్లి మాజీ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గుగులోత్ శ్రీరామ్ నాయక్, ఎల్లారెడ్డిపేట మండల బంజారా సంఘం అధ్యక్షులు భూక్య దేవిలాల్ నాయక్, ముస్తాబాద్ మండల బంజారా అధ్యక్షులు లకావత్ నర్సింలు నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అజ్మీర బాలు నాయక్, సర్పంచులు భూక్యా మోహన్ నాయక్, గుగులోత్ రమేష్ నాయక్, ధరవత్ కళ్యాణ్ నాయక్, రామావత్ శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నాయకులు పుణ్యా నాయక్, సీత్య నాయక్, సంజీవ్ నాయక్, రెడ్డి నాయక్, సరిలాల్ నాయక్, తిరుపతి నాయక్, ధర్మ నాయక్, దేవేందర్ నాయక్, బానోత్ వెంకటేష్ నాయక్, మూడవత్ రాజేష్ నాయక్, మధు నాయక్, శ్రీనివాస్ నాయక్, నాగరాజు నాయక్, పుల్సింగ్ నాయక్, భూక్యా లక్ష్మణ్ నాయక్, భూక్యా సూర్యకిరణ్ నాయక్, అజ్మీరా భీమ్లా నాయక్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.