రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్

రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు ఎస్‌ఐ శ్రీధర్, సీఐ రమేష్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీపీ, స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కను నాటారు.పరిసరాలు, రికార్డుల పరిశీలన:పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా ఉంచడంతో పాటు, వాటి వివరాలను సక్రమంగా నమోదు చేసి నిర్వహించాలని ఆదేశించారు. రిసెప్షన్ కేంద్రం సిబ్బందితో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో 5S విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, సిబ్బంది బ్యారక్‌ను తనిఖీ చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అలాగే సిబ్బందితో మాట్లాడి వారి వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నేరాల నియంత్రణ - ప్రత్యేక దృష్టి:స్టేషన్ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై ఎస్‌ఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారు, బాధితుడితో మర్యాదపూర్వకంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కీలకమైన ప్రాంతంలో ఉందని, హైవే, రైల్వే స్టేషన్‌తో పాటు కొత్త కాలనీలు అభివృద్ధి చెందుతున్నందున శాంతిభద్రతలు, రహదారి భద్రత, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైలు, రోడ్డు మార్గాల ద్వారా జరిగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు నిఘా, సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించి, ఆస్తి నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధిస్తున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు.కొత్త కాలనీల్లో వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, బ్లూకోట్స్ సిబ్బంది క్రమం తప్పకుండా పర్యటించి భద్రతా పరిస్థితులను పరిశీలించాలని, వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు స్టేషన్ నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఐ, ఎస్‌ఐలకు సూచించారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ నిర్వహణ బాగుందని ప్రశంసిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీపీ పిలుపునిచ్చారు.