Back to Home
Watermark
గురువారం, 17 సెప్టెంబర్, 2026 TIME : 06:28 PM

పుస్తెమెట్టెలు స్వర్ణకారులే విక్రయించే ఫైల్‌పైనే మొదటి సంతకం - తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకువస్తే, విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపేలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటామని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతితిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా విశ్వకర్మల సంక్షేమంపై కీలక హామీలు ఇస్తూ.. తాము అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు కేవలం స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి విక్రయించేలాంటి చట్టబద్ధమైన ఫైల్‌పైనే తన తొలి సంతకం ఉంటుందని ఆమె సంచలన హామీ ఇచ్చారు. విశ్వకర్మల్లోని మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పి అనే ఐదు దాయిల (కులాల) జీవితాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారి వృత్తుల్లో ఉండే కష్టాన్ని తాను దగ్గరుండి చూశానని, గతంలోనూ ఎన్నోసార్లు చట్టసభల్లో ఈ అంశాలపై గళం విప్పానని గుర్తుచేశారు.

ప్రస్తుతం కమర్షియల్ గోల్డ్ షాపులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సాంప్రదాయ స్వర్ణకారుల జీవితాలు రోడ్డున పడ్డాయని, కొందరు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్రంగులకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, శిల్పులకు దేవాలయాల కమిటీల్లో సముచిత స్థానం దక్కాలని డిమాండ్ చేశారు. సమాజంలో భూములు లేని విశ్వకర్మల లాంటి వర్గాలకు భూ పంపిణీ చేసే గొప్ప ఉద్దేశంతోనే 'భూలక్ష్మీ' పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ఈ భూలక్ష్మీ పథకానికి మారోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్ సార్, అమరుడు శ్రీకాంతాచారిలే ప్రధాన స్ఫూర్తి అని పేర్కొన్నారు. తనకు జయశంకర్ సార్ తండ్రితో సమానమని, ఆయన చిత్రపటం లేకుండా తమ పార్టీ కార్యక్రమమేదీ జరగదని స్పష్టం చేశారు.

విశ్వకర్మల కష్టం పూర్తిగా తెలిసిన బిడ్డనని, తమ పార్టీని ఆశీర్వదించాలని కవిత కోరారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా సరే, కుల పెద్దలు గత 40 ఏళ్లుగా విశ్వకర్మ జయంతిని ఇంత ఘనంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.

Clip Adjustments