వీర్నపల్లిలో కేసీఆర్, సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు బంజారాల పాలాభిషేకం ఎస్టీ రిజర్వేషన్ల పెంపును గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతా కార్యక్రమం

వీర్నపల్లి / తెలంగాణ అడ్డా:
వీర్నపల్లి మండల కేంద్రంలో బంజారా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఎస్టీల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022 సెప్టెంబర్ 30న జారీ చేసిన G.O.Ms.No.33కు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యాసంస్థల్లో ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్లు పెరిగినట్లు వారు గుర్తుచేశారు.
గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెరిగింది:ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గుగులోత్ కళావతి సురేష్ నాయక్ మాట్లాడుతూ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని, గిరిజనుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చారిత్రక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం చారిత్రక నిర్ణయం:కేసీఆర్ ప్రభుత్వం మారుమూల తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా రూపాంతరం చెందించడం ద్వారా గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా గుర్తింపు కల్పించిందని కళావతి సురేష్ నాయక్ తెలిపారు. అలాగే గిరిజన విద్యార్థుల కోసం గురుకులాల ఏర్పాటు, విదేశీ విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి వంటి పథకాలను అమలు చేసి వారి విద్యాభివృద్ధికి అప్పటి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆమె కొనియాడారు.గిరిజన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి:మండల మహిళా అధ్యక్షురాలు కళ, మాజీ మండల అధ్యక్షుడు శ్రీరాం నాయక్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ నాయకుడు భూక్యా దర్శింగ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో పేర్కొన్న గిరిజన సంక్షేమ హామీలు, ఎస్టీలకు ఆర్థిక సాయం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, సంత్ సేవాలాల్ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించడం, మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
మండల కేంద్రంతో పాటు వివిధ తండా గ్రామపంచాయతీల్లోనూ కేసీఆర్, సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, బంజారా సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.