చెన్నూర్ చెరువు ఘాట్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ ఎ.భాస్కర్.. భద్రతా చర్యలపై అధికారులకు ఆదేశాలు

చెన్నూర్ / తెలంగాణ అడ్డా:
చెన్నూర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే చెన్నూర్ చెరువు ఘాట్‌ను మంచిర్యాల జోన్ డీసీపీ ఎ.భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ బన్సీలాల్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విగ్రహాలు వచ్చే మార్గం, బయటకు వెళ్లే మార్గం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరియు క్రెన్లను ఏర్పాటు చేసే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. చెన్నూర్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకల వేళ భక్తులకు, నిర్వాహకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గౌరవ మంత్రి శ్రీ వి. వెంకటస్వామి చేతుల మీదుగా ఈ నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ వద్ద ప్రత్యేక లైటింగ్‌తో పాటు రెండు భారీ క్రేన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విగ్రహాలను తీసుకువచ్చే నిర్వాహకులు ముందుగానే వాహనాలపై సురక్షితంగా ఏర్పాటు చేసుకుని రావాలని, శోభాయాత్ర ప్రశాంతంగా, శోభాయమానంగా జరిగేలా పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు:
మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది సుమారు 2,800 వినాయక విగ్రహాలను ప్రతిష్టించినట్లు డీసీపీ తెలిపారు. నిమజ్జన కార్యక్రమం కోసం మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు గోదావరి వ్యూ పాయింట్, ఇందారం మరియు వివిధ చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే మందమర్రి, తాండూర్ తదితర ప్రాంతాల్లోనూ జిల్లా యంత్రాంగం, రక్షక దళాల సహకారంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
భక్తులకు కీలక సూచనలు నిమజ్జనం సందర్భంగా చిన్నపిల్లలు మరియు మద్యం సేవించిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరించారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా భక్తుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.