‘అధికారి వస్తేనే పని’ అన్న పరిస్థితి? యాదాద్రి స్ఫూర్తితో కరీంనగర్‌లోనూ సమయపాలనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టరేట్ గేట్ వద్ద ఉదయం 10.30 గంటల తర్వాత వచ్చిన ఉద్యోగులను నిలిపివేస్తూ జిల్లా యంత్రాంగం తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు కరీంనగర్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన గాడి తప్పుతుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు నిర్దేశిత వేళలకు విధులకు హాజరుకావాల్సి ఉండగా, కొందరు తమకు అనుకూలమైన సమయానికి రావడం, మరికొందరు ముందుగానే వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.
కార్యాలయాల్లో అత్యాధునిక హాజరు యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాసంబంధిత శాఖల్లో సిబ్బంది సమయానికి అందుబాటులో లేకపోవడంతో, సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే సామాన్యులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ధ్రువపత్రాలు, దరఖాస్తులు మరియు సంక్షేమ పథకాల కోసం వచ్చి ‘అధికారి వస్తేనే పని’ అన్నట్లుగా గంటల తరబడి ఎదురుచూసి అధికారులు లేక వెనుదిరగాల్సిన దైన్యం ప్రజలకు తప్పట్లేదు.
ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో అమలు చేసిన తరహాలోనే కరీంనగర్‌లోనూ సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలు పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. కలెక్టరేట్ వంటి అత్యున్నత అధికార కేంద్రంలో క్రమశిక్షణను కట్టుదిట్టం చేస్తేనే ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.