మహిళా సంఘాల అధ్యక్షులు మరియు వివో లతో సమావేశం గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేశ్ ఆధ్వర్యంలో సమావేశం

తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి:
గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేశ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రుణాలపై అవగాహన కల్పించారు.
మహిళా సంఘాల ద్వారా గ్రామపంచాయతీలో సోలార్ ఏర్పాటు చేసేందుకు రూ.10 లక్షల రుణం పొందే అంశంపై చర్చించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం గత విడతలో విడుదల చేసిన రుణమాఫీకి సంబంధించిన వివరాలను ప్రతి సంఘం సభ్యులకు తెలియజేశారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు వారానికి రెండుసార్లు ట్రాక్టర్ వస్తుందని, ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను ట్రాక్టర్లో వేయాలని కోరారు.
ప్రభుత్వం మహిళా సంఘాలకు బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ విధానం ద్వారా టెన్త్, ఇంటర్ విద్యను పూర్తి చేసుకోవాలని సూచించారు.
త్వరలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నందున మహిళా సంఘాల సభ్యులు సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న కొత్త పథకాలు, రుణాల వివరాలను కూడా సమావేశంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో పురుషోత్తం, మార మహేందర్, వీఓ అధ్యక్షురాలు, గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేశ్, వివిధ మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.